సమీక్ష… వరల్డ్ ఫేమస్ లవర్సమీక్ష... వరల్డ్ ఫేమస్ లవర్

నటీనటులు: విజయ్ దేవరకొండ-రాశి ఖన్నా-ఐశ్వర్యా రాజేష్-కేథరిన్ థ్రెసా-ఇజబెల్లా-ప్రియదర్శి-జయప్రకాష్ తదిరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
నిర్మాత: కె.ఎ.వల్లభ
రచన-దర్శకత్వం: క్రాంతిమాధవ్

‘లెట్స్ డ్రాగ్’

సినిమా ద్వితీయార్థం లో ఈ డైలాగు వినిపిస్తుంది. అప్పుడు అర్థం కాదు కానీ కాస్సేపటికి అర్థం అవుతుంది. సినిమా ఇక్కడ నుంచి డ్రాగ్ చేయాలని డైరక్టర్ డిసైడ్ అయిపోయాడని.

అలాగే సినిమా చివర్న హీరోయిన్ నేరుగా హీరోయిన్ అడుగుతుంది.

‘ఇంటికి దారి తెలుసా’ అని, ఆ వెంటనే ఆడియన్స్ అనుకునేది కూడా. ఇలాంటి సినిమా చూసాక ఇంటికి దారి మరిచిపోవడం సహజం అని.

విజయ దేవరకొండ లాంటి హీరో, రాశీఖన్నా, ఐశ్యర్య రాజేష్ లాంటి హీరోయిన్లు దొరికిన తరువాత తను ఏం తీసినా, ఎలా తీసినా జనం చూసేస్తారని భ్రమపడ్డారేమో దర్శకుడు క్రాంతిమాధవ్, రచయితగా తన మేథకు ఏ మాత్రం పని చెప్పకుండా సినిమా తీసి థియేటర్లో వదిలారు.

ఓ రచయిత సరైన నవల రాయడానికి విపరీతంగా ఇబ్బంది పడుతుంటాడు. ప్రియురాలిని పట్టించుకోడు, తిన్నానా, వున్నానా? అన్నది చూసుకోడు. అలాంటి రచయిత రాసిన కథ లేదా కథలు ఏ రేంజ్ లో వుండాలి. వాటి స్థాయి ఎలా వుండాలి. ఈ చిన్న లాజిక్ ను మిస్సయాడో లేదా, అంత గొప్ప కథలు రాసే స్టామినా లేదో, దర్శకుడు కమ్ రచయిత క్రాంతి మాధవ్ కు, ఓ సాదా సీదా కథలు అల్లి, ఇవే గొప్ప కథలు అన్నంత బిల్డప్ ఇచ్చి, సినిమాలో చొప్పించాడు. కథలు అల్లడమే వీక్ అనుకుంటే క్యారెక్టరైజేషన్ లో అంతకన్నా వీక్ అనిపించాడు.

హీరోకి ఓ నవల రాయాలనే తపనలో తిన్నానా లేదా చూసుకోడు. లివింగ్ రిలేషన్ షిప్ లో వున్న అమ్మాయి వైపు కన్నెత్తి చూడడు. మరేదీ పట్టదు… కానీ, రాత్రి అయితే చాలు ఆమె ఎలా ఫీలవుతోందో అన్నది కూడా చూసుకోకుండా, అనుభవించేసి, తన మానాన తను నిద్రపోతాడు. అలాంటి రచయిత రాసిన మరో హీరో క్యారెక్టర్లు కూడా అలాంటివే. ఇలా ప్రేమించాను అని చెప్పి, అలా ఆమెను అనుభవించడానికి రెడీ అయిపోతాడు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే తహతహలాడిపోతాడు. ఇలాంటి రెండు కథలతో కూడిన మూడు కథల సంకలనానికి వరల్డ్ ఫేమస్ లవర్ అనే పేరు. ఆ బుక్ జనం పిచ్చిగా కొని చదివేసారనే భ్రమ.

నిజానికి సినిమాలో రచయిత తాను అద్భుతమైన కథ రాసేసానని భ్రమపడలేదు. దర్శకుడు క్రాంతి మాధవ్ నే తాను అమోఘమైన కథతో సినిమా చేస్తున్నా అని భ్రమించాడు. అలా భ్రమలో ఓ అసంబద్ధ సినిమా తీసి అందించాడు. ఇంతకీ ఆ కథేంటంటే..

గౌతమ్ (విజయ్ దేవరకొండ)-యామిని (రాశీఖన్నా) లివింగ్ రిలేషన్ లో వుంటారు. యామిని తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదని, లివింగ్ రిలేషన్ కు దిగుతారు. అంటే ఆ గొప్ప తండ్రి ఫలానా వాడు తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి తగడు అనుకుంటాడు కానీ, పెళ్లి చేసుకోకుండా రోజూ బెడ్ షేర్ చేసుకోవడానికి మాత్రం సరిపోతాడని అనేసుకున్నాడన్నమాట. సరే ఆ సంగతి అలా వుంచితే, యామిని కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి, నవల రాసుకోవాలని అబద్దం చెప్పి, ఆ పని మీద వుంటాడు. అలాంటి వాడు తనను సరిగ్గాచూడడం లేదని బ్రేకప్ అంటుంది యామిని. దాంతో హీరో మెంటల్ అయిపోయినట్లు తయారవుతాడు. అలాంటి స్టేజ్ లోనే రెండు కథలు రాస్తాడు. ఓ మర్డర్ అటెంప్ట్ చేసి జైలు పాలవుతాడు. ఈ రెండు కథలు ఏమిటి? చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

పరమ అసంబద్దమైన క్యారెక్టర్లు, అర్థం పర్థం లేని క్లయిమాక్స్, సాదాసీదాగా అనిపించే రెండు కథలు కలిపి, మెయిన్ లీడ్ స్టోరీకి ముడిపెట్టి తీసిన సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ప్రారంభం కాస్త ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. సినిమాలో వేరే కథలను చెప్పడానికి పట్టుకున్న మెయిన్ థ్రెడ్ బాగానే వుంది అనిపిస్తుంది. కానీ అంతలోనే హీరో క్యారెక్టరైజేషన్ చూసి వెగటు వస్తుంది. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ ను హీరో పక్కకు రాలేదా? లేక అదే దోవలో ఈ దర్శకుడు కూడా వెళ్లాలనుకున్నాడా?అని అనుమానం కలుగుతుంది.

సరే అది పక్కన పెట్టి వేరే కథలు ప్రారంభమైన తరువాత శీనయ్య ఎపిసోడ్ రావడంతో ప్రేక్షకులకు మళ్లీ కాస్త ఆశ కలుగుతుంది. ఎప్పుడూ చూడని సింగరేణి బ్యాక్ డ్రాప్ కావడం, సహజమైన పాత్రలు కనిపించడంతో బాగానే వుందనిపిస్తుంది. అక్కడా హీరో క్యారెక్టర్ విడ్డూరంగానే వుంటుంది. పెళ్లంపై చికాకు పడుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కొడుకును కూడా కసరుకుంటాడు, తనను పట్టుకోవద్దంటాడు? అదేంటో? అదే ఎపిసోడ్ లో వచ్చే కేథరిన్ పాత్ర కూడా విడ్డూరంగానే ప్రవర్తిస్తూ వుంటుంది. ఆ పాత్రకు హీరో మీద వున్న ఫీలింగ్ ఏమిటి? ప్రేమా? మరోటా?అన్నది క్లారిటీ వుండదు. అలాంటిది ఏమీ లేకుండానే ముగించేస్తాడు.

పారిస్ లో కథ ప్రారంభమైన తరువాత హీరో కళ్లు దానం చేయడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో ఏమాత్రం కదలిక తీసుకురాదు. అప్పటి దాకా చూస్తున్న సినిమాతో విసుగెత్తిన ప్రేక్షకులు, ఈ పాయింట్ ను లైట్ తీసుకుంటారు. హీరోను జైలుకు పంపడం కోసం ఏర్పాటు చేసిన సీన్ కూడా చిత్రంగా వుంటుంది. హీరో ఒకటికి రెండు సార్లు కారుతో అవతలి వాడి కారును ఢీకొట్టిస్తాడు. కానీ అదే పని అవతలివాడు చేస్తే, వాడిని చంపేసేంత ప్రయత్నం చేస్తాడు. ఎటొచ్చీ రెండేళ్లలో హీరోను బయటకు తేవాలి అన్నది పాయింట్ కాబట్టి, వాడు చావడు.

ఇక క్లయిమాక్స్ మరీ ఘోరం. ‘నేను పెళ్లి చేసుకుంటున్నా’ అంటు తెగ గోల చేసిన అమ్మాయి, పెళ్లి పీటల మీదకు వెళ్లిన పిల్ల, రెండేళ్ల తరువాత  ‘చేసుకోలేదోచ్’ అంటూ మళ్లీ హీరో దగ్గరకే వచ్చేస్తుంది. పోనీ హీరోకి అంటే జ్ఞానోదయం అయింది. తాను చేసింది తప్పు అని తెలిసింది. మరి ఇంతకీ హీరోయిన్ కు ఏమయ్యింది? ఏం తెలిసింది? ఎందుకు వచ్చేసింది? దర్శకుడు కమ్ రచయిత క్రాంతిమాదవ్ కే తెలియాలి.

ఇలాంటి అసంబద్ధమైన కథను డీల్ చేయడంలో క్రాంతి మాధవ్ చేసిందానికన్నా, హీరో విజయ్ చేసుకున్నదే ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టయిల్ ఆఫ్ డైరక్షన్ అంతా విజయ్ దే అనిపిస్తుంది. మళ్లీ మళ్లీ రాని రోజు అనే మాంచి ప్రేమ కథను అత్యంత సున్నితంగా చెప్పిన దర్శకుడు ఈయనేనా అన్న అనుమానం కలుగుతుంది. ప్రేమకథాచిత్రాలకు పాటలు కీలకం. సినిమాలో ఒక్క పాట కూడా రిజిస్టర్ కాదు. అసలు సరైన పాటలే లేవు. డ్యూయట్ అన్నదానికి చాన్స్ నే లేదు స్క్రిప్ట్ లో? ఇది దర్శకుడు ధైర్యం అనుకోవాలి. శీనయ్య ఎపిసోడ్ లో ఐశ్యర్య రాజేష్ వచ్చినపుడల్లా టీవీ సీరియల్ అనిపిస్తుంది.

నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బుల ఖర్చు కనిపిస్తుంది. అంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గర పాయింట్ లేదు. విజయ్ బాగా చేసాడు అని అనడానికి లేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి స్టయిల్ నే మరోసారి చూపించాడు. శీనయ్య పాత్రలో మాత్రమే కాస్త కొత్తదనం చూపించే ప్రయత్నం చేసాడు. అయితే వివిధ రకాల గెటప్ ల్లో విజయ్ లుక్ లు మాత్రం బాగున్నాయి. అదొక్కటే పాజిటివ్ అంశం. రాశీఖన్నా, ఐశ్వర్య బాగానే చేసారు కానీ ఉపయోగం లేదు.

వరల్డ్ ఫేమస్ లవర్ అనేంత అద్భుతమైన టైటిల్ పెట్టుకుని, గుండెలు పట్టే స్థాయి సీన్ ఒక్కటంటే ఒక్కటి రాసుకోలేక, తీసుకోలేక అన్నివిధాలా తాను ఫెయిల్యూర్ అనిపించుకున్నాడు దర్శకుడు క్రాంతి మాధవ్.

రేటింగ్-2.25/5
ఫినిషింగ్ టచ్….వరల్డ్ ఫేమస్ ఫెయిల్యూర్Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *