‘ఎంత మంచివాడవురా’'ఎంత మంచివాడవురా'

చిత్రం : ‘ఎంత మంచివాడవురా’

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్ –
మెహ్రీన్ కౌర్ – విజయ్ కుమార్ – సుమిత్ర – తనికెళ్ల భరణి – పవిత్ర లోకేష్ –
రాజీవ్ కనకాల – శరత్ బాబు – సుహాసిని-వెన్నెల కిషోర్ – నరేష్ – సుదర్శన్
తదితరులు
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: రాజ్ తోట
నిర్మాతలు: ఉమేష్  గుప్తా – సుభాష్ గుప్తా – శివలెంక కృష్ణప్రసాద్
రచన-దర్శకత్వం: సతీశ్ వేగేశ్న

గత
ఏడాది ‘118’ సినిమాతో సక్సెస్ సాధించి కాస్త నిలదొక్కుకున్నాడు నందమూరి
కళ్యాణ్ రామ్. దాని తర్వాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎంత
మంచివాడవురా’. సంక్రాంతికి భారీ చిత్రాలు రేసులో ఉన్నా ధీమాగా ఈ చిత్రాన్ని
బరిలో నిలిపారు. మరి ఆ చిత్రాల పోటీని తట్టుకుని నిలబడే స్థాయిలో ఇందులో
విషయం ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

బాలు (కళ్యాణ్ రామ్) ఓ
అనాథ. చిన్నప్పటి నుంచి అన్ని బంధాలకూ దూరంగా పెరిగిన అతను.. పెద్దయ్యాక
తనలా నా అనే వాళ్ల కోసం చూస్తున్న వాళ్లకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తాడు.
అందరినీ తనవాళ్లు అనుకుని వాళ్లకు సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ‘ఆల్ ఈజ్
వెల్’ పేరుతో ఎమోషన్లు సప్లై చేసే ఓ కొత్త తరహా బిజినెస్ కూడా
మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో బాలుకు ఎదురైన అనుభవాలు.. సవాళ్లేంటి.. వీటిని
అతనెలా అధిగమించాడు అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

‘ఎంత
మంచివాడవురా’లో హీరో చాలా మంచోడు.  ఆ మంచితనంతోనే ‘ఆల్ ఈజ్ వెల్’ పేరుతో ఒక
కంపెనీ పెడతాడు. ఆ కంపెనీ ఏం చేస్తుందయ్యా అంటే ఎమోషన్లు సప్లై చేస్తుందట.
ఈ బిజినెస్ గురించి జనాలు ఫీడ్ బ్యాక్ ఇచ్చే ఒక సీన్ చూపిస్తారు. అందులో ఓ
అమ్మాయి ‘ఎమోషన్లు సప్లై చేయడమేంటి.. ఫేక్ రిలేషన్స్.. ఫేక్ ఎమోషన్లు’’
అంటూ ఒక మాట అంటుంది. హీరో ఐడియా చూశాక.. ఈ కథ నడిచే తీరు చూశాక
ఆడియెన్స్కి కూడా ఇలాంటి భావనే కలిగితే ఆశ్చర్యమేమీ లేదు. తమ కొడుకుకు
దూరంగా ఉన్న తల్లిదండ్రులు.. అతను వచ్చి తమతో సమయం గడిపితే సంతోషిస్తారు
కానీ.. ఇలా ఎమోషన్లు సప్లై చేసే కంపెనీకి ఫోన్ చేసి.. వాళ్లకు డబ్బులు
కట్టి వాళ్లు పంపించే అద్దె కొడుకు వచ్చి తమతో ఆప్యాయంగా నటిస్తే.. కబుర్లు
చెబితే.. ఆనందిస్తారా? తన అమ్మమ్మ చచ్చిపోయిందని బాధపడుతున్న మనవరాలు..
ఆమె స్థానంలో ఈ కంపెనీ వాళ్లు పంపించే పెద్దావిడతో క్లోజ్ అయిపోతుందా?
ఇలాంటి కృత్రిమమైన. పాయింట్ మీద నడిచే సినిమాతో ప్రేక్షకులు మాత్రం ఎలా
కనెక్టవుతారు?

హీరోను అతి మంచివాడిగా చూపిస్తూ.. అతడితో అన్నీ మంచి
పనులే చేయిస్తూ.. తెరమీదంతా మంచితనం పరుచుకుంటూ ఉంటే ఈ తరం ఆడియన్స్
ఎంతమాత్రం ఆదరించే పరిస్థితి లేదు. ఈ తరహా మంచి వాడి పాత్రలతో 90ల్లో సూపర్
గుడ్ ఫిలిమ్స్ వాళ్లు తమిళం నుంచి పట్టుకొచ్చిన కథలతో రీమేక్ సినిమాలు
తీసేవాళ్లు. వాటికి ఎస్.ఎ.రాజ్ కుమార్ తనదైన శైలిలో మెల్ల డ్రమాటిక్ సంగీతం
అందించేవాడు. అప్పటికి ఆ సినిమాలు బాగానే అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు
అవి చూస్తే డ్రామా తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ‘ఎంత మంచివాడవురా’ మళ్లీ
మనల్ని ఆ రోజులకు తీసుకెళ్తుంది. అసలు సంఘర్షణ అంటూ లేని కథతో పాత్రలతో..
విపరీతమైన మెలోడ్రామాతో నడిచే ‘ఎంత మంచివాడవురా’ ఏ సందర్భంలోనూ ఎంగేజింగ్
గా అనిపించదు. కొన్ని సందర్భాల్లో సినిమాలోని అతి మంచితనంతో ముడిపడ్డ
సీన్లు ‘బ్రహ్మోత్సవం’ను కూడా గుర్తు చేస్తాయి.

సినిమాల ద్వారా మంచి
చెప్పాలనుకోవడం సందేశాలు ఇవ్వాలనుకోవడం తప్పేమీ కాదు. ఐతే అవి
అంతర్లీనంగా ఉండాలి. ‘శతమానం భవతి’ సినిమాలో సతీశ్ వేగేశ్న అదే చేశాడు.
కానీ ‘శ్రీనివాస కళ్యాణం’కు వచ్చేసరికి ట్రాక్ తప్పాడు. అసహజమైన కథ
పాత్రలతో దాన్ని ప్రేక్షకుల అభిరుచికి సరిపడని విధంగా తయారు చేశాడు.
ఇప్పుడు ‘ఎంతమంచివాడవురా’తో అతను మరింతగా ట్రాక్ తప్పాడు. ఏమాత్రం కనెక్ట్
కాని కథా కథనాలతో ఆడియన్స్ చాలా త్వరగా డిస్కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని
తీర్చిదిద్దాడు. ఏ దశలోనూ ఇందులోని ఎమోషన్లతో కనెక్టయ్యే అవకాశం లేదు. కథలో
సంఘర్షణ కూడా లేకపోవడం హీరోకు ఎక్కడా పెద్దగా సవాళ్లు కూడా లేకపోవడంతో
సినిమా ఫ్లాట్ గా నడుస్తుంది. నరేష్ వెన్నెల కిషోర్ సుదర్శన్ పేల్చిన
కొన్ని జోకులు మినహాయిస్తే వినోదానికి పెద్దగా ఆస్కారం లేదు.  ఒక దశలో మనం
చూస్తున్నది సినిమానా.. సీరియలా అనే సందేహం కూడా కలుగుతుంది. కుటుంబ
ప్రేక్షకుల్ని టార్గెట్ చేసిన ఈ సినిమా వాళ్లకు కూడా భారంగా అనిపిస్తుందంటే
ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

నటీనటులు:

కళ్యాణ్ రామ్
ఇలాంటి పాత్ర చేయడం అతడికి కొత్త కావచ్చు. కానీ ఇలాంటి పాత్ర ప్రేక్షకులకు
కొత్త కాదు. తన వంతుగా అతను మంచి పెర్ఫామెున్సే ఇచ్చినా అతడి పాత్రతో
ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం. మెహ్రీన్ కౌర్ పాత్ర విసిగిస్తుంది.
ఎంతసేపూ హీరో మీద అతిశయమైన ప్రేమ చూపించే ఆమె పాత్రను ఒక దశ దాటాక భరించడం
కష్టమవుతుంది. తనికెళ్ల భరణి పవిత్ర లోకేష్ బాగానే చేశారు. విజయ్ కుమార్
సుమిత్ర శరత్ బాబు సుహాసిని ఓకే. నరేష్ – వెన్నెల కిషోర్ – సుదర్శన్ ఓ
మోస్తరుగా వవ్వించారు. మిగతా పాత్రలన్నీ మామూలే.

సాంకేతిక వర్గం:

గోపీసుందర్
పాటల్లో ఏమో ఏమో ఒక్కటి ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలన్నీ బోరింగ్
గా అనిపిస్తాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కు తగ్గట్లుగా పాతగా
అనిపిస్తుంది. రాజ్ తోట ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు
తగ్గట్లుగా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న ‘శతమానం భవతి’
తర్వాత ఒక ఛట్రంలో కూరుకుపోయాడనిపిస్తుంది. ‘శ్రీనివాస కళ్యాణం’తో పోలిస్తే
మరింత అసహజమైన కథాకథనాలు పాత్రలు ఎమోషన్లతో అతను ప్రేక్షకుల అభిరుచికి
దూరంగా వెళ్లిపోయాడు. సతీశ్ స్క్రీన్ ప్లే – నరేషన్ ఔట్ డేటెడ్ గా
అనిపిస్తాయి.

చివరగా: ఎంత మంచివాడవురా.. మనసును తాకని ‘మంచితనం’

రేటింగ్-1.75/5

Disclaimer
: This Review is An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theatre  Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *