‘దర్బార్’'దర్బార్'

చిత్రం : ‘దర్బార్’

నటీనటులు: రజనీకాంత్ – నయనతార – సునీల్ శెట్టి – నివేథా థామస్ – ప్రతీక్ బబ్బర్ – యోగిబాబు – జ్యోతి సర్నా – నవాబ్ షా తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
నిర్మాత: సుభాస్కరన్
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మురుగదాస్

గత
కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో తన స్థాయిని బాగా తగ్గించేసుకున్నాడు సూపర్
స్టార్ రజనీకాంత్. గత ఏడాది సంక్రాంతికి ఆయన్నుంచి వచ్చిన ‘పేట’ కూడా నిరాశ
పరిచింది. ఇప్పుడు మరోసారి సంక్రాంతి రేసులో నిలిచాడు సూపర్ స్టార్. ఈసారి
అగ్ర దర్శకుడు మురుగదాస్ ఆయన్ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమానే.. దర్బార్. ఈ
రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఆదిత్య
అరుణాచలం (రజనీకాంత్) ఐపీఎస్ అధికారి. ఢిల్లీలో పని చేస్తున్న ఆయన్ని
ముంబయిలో డ్రగ్ రాకెట్ సంగతి తేల్చేందుకు ఉన్నతాధికారులు ముంబయి సిటీ
కమిషనర్ గా పంపుతారు. ఆదిత్య రంగంలోకి దిగగానే డ్రగ్ రాకెట్ ఆటలకు బ్రేక్
పడుతుంది. డ్రగ్ మాఫియాను నడిపిస్తున్న అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్) ను
అరెస్ట్ చేసిన ఆదిత్య అతడికి శిక్ష పడేలా చేస్తాడు. అతను పోలీసుల్ని
బోల్తా కొట్టించే ప్రయత్నం చేయగా.. ఆదిత్య తెలివిగా జైల్లోనే అతడిని
మట్టుబెడతాడు. ఈ ఎన్ కౌంటర్ తో కలకలం రేగుతుంది. అజయ్ కోసం ఇంటర్నేషనల్
మాఫియా డాన్ హరి చోప్రా (సునీల్ శెట్టి) రంగంలోకి దిగుతాడు. అతడికి అజయ్ కి
సంబంధమేంటి.. ఎన్ కౌంటర్ తర్వాత ఆదిత్యకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి.
వాటినెలా అతనెలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

ఎప్పుడో
30 ఏళ్ల నుంచి చూస్తున్నాం రజనీ సిగ్నేచర్ స్టైల్స్. ఆయన తనదైన శైలిలో ఎలా
నడుస్తాడో తెలుసు. కళ్లద్దాలు ఎలా స్టైల్ గా పెట్టుకుంటాడో తెలుసు.
మాట్లాడేటపుడు చేతులు ఇటూ అటూ ఎలా ఫాస్టుగా తిప్పుతాడో తెలుసు. ఒకే చోట
నిలబడి నడుము ఇటు అటు ఆడిస్తూ చేతులు రింగులు తిప్పుతూ ఎలా డ్యాన్స్
చేస్తాడో కూడా తెలుసు. యూట్యూబ్ లోకి రజనీ స్టైల్ అని కొడితే కుప్పలు
కుప్పలుగా వీడియోలు వచ్చి పడతాయి. ఐతే చిత్రంగా ఈ మధ్య కొందరు దర్శకులు
రజనీ స్టైల్స్ ని గుర్తు చేయడానికి.. వింటేజ్ రజనీని చూపించడానికి తెగ
తాపత్రయ పడిపోతుండటం విడ్డూరం. ఏ కేఎస్ రవికుమార్ లాంటి వాళ్లో అలాంటి
ప్రయత్నాలు చేస్తే ఆశ్చర్యమేమీ లేదు. కానీ దర్శకులుగా తమకంటూ ఒక
ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని.. కథా బలంగా బిగువైన సినిమాలు తీసిన
దర్శకులు రజనీతో సినిమా అనేసరికి తమ శైలిని విడిచిపెట్టి రజనీ చరిష్మాను
నమ్ముకుని విషయం లేని కథలతో నేలవిడిచి సాము చేయడం నిరాశ కలిగించే విషయం. గత
ఏడాది యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రజనీని ‘స్టైల్’గా చూపించే
ప్రయత్నం చేసి బోల్తా కొడితే.. ఇప్పుడు అగ్ర దర్శకుడు మురుగదాస్ అదే బాటలో
నడిచాడు. ఆయన్నుంచి వచ్చిన అత్యంత బలహీన చిత్రాల్లో ‘దర్బార్’ ఒకటనడంలో
సందేహం లేదు.

రజనీ ఇంట్రడక్షన్ సీన్లో స్టైలుగా నడుచుకొస్తే.. రౌడీల
గుంపు మీదికి దూకి వాళ్లను ఇరగదీస్తే.. ఆ తర్వాత ఒక పాటేసుకుని
స్టెప్పులేస్తే.. తర్వాతి సీన్లో ఒక పంచ్ డైలాగ్ వేస్తే.. అప్పటి వరకు
అభిమానులకు బాగానే ఉంటుంది. కానీ ఇలా ఓ అరగంట వరకైతే నెట్టుకురావచ్చు. ఆ
తర్వాత సినిమాను నడిపించాల్సింది కథే. అది లేకుండా రజనీ అయినా ఏమీ చేయలేడు.
ఎంతసేపూ తన స్టైల్స్.. మేనరిజంలతో మేనేజ్ చేయడమంటే సూపర్ స్టార్ కు కూడా
కష్టమే. ఐతే ‘దర్బార్’ సినిమాలో సరైన కథే లేకపోవడం.. ఒకప్పట్లా మురుగదాస్
కథనంతోనూ మ్యాజిక్ చేయలేకపోవడంతో రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న
సినిమాలో చాలా సమయం భారంగా గడుస్తుంది. మురుగదాస్ తీసిన ‘తుపాకి’ లాంటి
కొన్ని సినిమాల్లో విలన్ని సింగిల్ గా.. చాలా సింపుల్ గా చూపిస్తూనే..
దాన్ని ఎలివేషన్లో మాత్రం తేడా రాకుండా చూసుకున్నాడు. విలన్ పాత్రను బలంగా
తీర్చిదిద్దడం ద్వారా హీరో పాత్ర కూడా ఎలివేట్ అయ్యేలా చూసుకున్నాడు. కానీ
‘దర్బార్’లో విలన్ పాత్ర తేలిపోవడం.. ఎంతసేపూ రజనీని ఎలివేట్ చేయడం (అది
కూడా ప్రధానంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారానే)తో సరైన సంఘర్షణే లేకపోయింది.

ముందు
హీరో విలన్ గ్యాంగ్ మీద ఎటాక్ చేయడం.. అతడికి నష్టం చేయడం.. అతను బదులుగా
హీరోను దెబ్బ కొట్టడం.. తర్వాత హీరో విలన్ మీద ప్రతీకారం తీర్చుకోవడం.. ఇలా
వందలసార్లు చూసిన అతి సాధారణమైన కథే ‘దర్బార్’లోనూ కనిపిస్తుంది. గత రెండు
సినిమాల్లో మురుగదాస్ ముద్ర అంతగా కనిపించకపోయినా.. రజనీతో తన కలల సినిమా
అనేసరికి ఏదో ప్రత్యేకమైన కథతోనే మురుగదాస్ రంగంలోకి దిగి
ఉంటాడనుకునేవాళ్లకు నిరాశ తప్పదు. ఐతే ‘తుపాకి’లో కూడా ఇలాంటి సింగిల్ లైన్
స్టోరీనే కనిపిస్తుంది. కానీ దాన్ని బిగువైన స్క్రీన్ ప్లేతో కొత్త
సన్నివేశాలతో అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు మురుగదాస్. కానీ ఆ మ్యాజిక్
‘దర్బార్’లో కనిపించలేదు. సినిమాలో మురుగదాస్ ముద్ర కనిపించేది ఒక్క ప్రి
ఇంటర్వెల్ బ్లాక్ లో మాత్రమే. కొంచెం లాజిక్ కు అందని విధంగా
సాగినప్పటికీ.. విలన్ కొడుకుని తెలివిగా హీరో మట్టుబెట్టే ఎపిసోడ్ ఒకటి
ఆసక్తికరంగా సాగి.. సినిమాపై అంచనాలు పెంచుతుంది. కానీ ఆ ఊపును
కొనసాగించడంలో మురుగదాస్ ఫెయిలయ్యాడు.

ప్రథమార్ధంలో అయినా.. రజనీ
ఇంట్రో సీన్లలో ఉండే జోరు.. నయనతారతో సరదాగా సాగే రొమాంటిక్ ట్రాక్.. ప్రి
ఇంటర్వెల్ ఎపిసోడ్ వల్ల ‘దర్బార్’ ఓ మోస్తరుగా అనిపిస్తుంది. కానీ చాలా
రొటీన్ గా.. ఏ విశేషం లేకుండా సాగే ద్వితీయార్ధంలో ‘దర్బార్’
నీరుగారిపోయేలా చేసింది. మెయిన్ విలన్ రంగంలోకి దిగాక మరో స్థాయికి
చేరాల్సిన సినిమా చల్లబడిపోతుంది. కూతురి సెంటిమెంట్.. రివెంజ్ డ్రామా చాలా
రొటీన్ గా అనిపించి ‘దర్బార్’ అతి సాధారణమైన సినిమాగా మారిపోతుంది రెండో
అర్ధంలో. అసలు మనం చూస్తున్నది మురుగదాస్ సినిమానేనా.. ఏమైంది ఆయనకు
అనిపించేలా సాగుతాయి కొన్ని సన్నివేశాలు. కమిషనర్ స్థాయిలో ఉన్న రజనీ..
విలన్ దొరికితే అలా చంపేస్తా ఇలా చంపేస్తా అంటూ పిచ్చి పిచ్చి హావభావాలు
పెడుతుంటే ఇంటెన్సిటీ అంతా పోయి కామెడీగా అనిపిస్తుంది. అలాగే తన ఉద్యోగం
నిలబెట్టుకోవడానికి రజనీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
దీంతో ఆయన జిమ్ లో అడుగుపెట్టి బాడీ చూపిస్తూ కసరత్తులు చేస్తారు. అక్కడ
ఎలా మేనేజ్ చేశారో కానీ.. రజనీ నమ్మశక్యంగా కాని విధంగా కనిపిస్తాడు. ఆ
సీన్లు సైతం కొంత సిల్లీగానే అనిపిస్తాయి. ఈ ఎపిసోడ్ లతో ‘దర్బార్’ గ్రాఫ్
బాగా పడిపోగా.. క్లైమాక్స్ కూడా సాధారణంగా మారడంతో చివరికొచ్చేసరికి
‘దర్బార్’ మీద ఇంప్రెషన్ పూర్తిగా పడిపోతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే.. రజనీ
మార్కు స్టైల్స్ మేనరిజమ్స్ చూసి ఆస్వాదించాలనుకుంటే ‘దర్బార్’పై ఓ
లుక్కేయొచ్చు కానీ.. మురుగదాస్ మార్కు థ్రిల్లర్ చూద్దామంటే మాత్రం నిరాశ
తప్పదు.

నటీనటులు:

మిగతా విషయాలన్నీ పక్కన పెడితే 70 ఏళ్ల
వయసులో రజనీకాంత్ చూపించిన ఉత్సాహానికి.. ఈ వయసులోనూ కుర్ర హీరోలా చాలా
హుషారుగా నటించిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రజనీ నుంచి ఆశించే
సిగ్నేచర్ ‘స్టైల్స్’కు సినిమాలో ఢోకా లేదు. ఐతే ఒక దశ దాటాక సినిమాలో ఇవి
బోర్ కొట్టిస్తాయి. రజనీ లుక్ బాగుంది. నటన విషయానికొస్తే రజనీకి కొత్తగా
పరీక్ష పెట్టే సన్నివేశాలేమీ ఇందులో లేవు. తన వరకు ఆయన అభిమానులతో పాటు
మామూలు ప్రేక్షకుల్ని కూడా అలరించేలా నటించాడు. నయనతార స్థాయికి తగ్గ పాత్ర
చేయలేదిందులో. రజనీ సినిమా అనేసరికి మొహమాటానికి ఒప్పుకున్నట్లుంది. ఆమెతో
పోలిస్తే నివేథా థామస్ పాత్రకు ప్రాధాన్యం ఉంది. రజనీ కూతురి పాత్రలో ఆమె
మెప్పించింది. విలన్ గా సునీల్ శెట్టి చేసిందేమీ లేదు. పాత్ర లాగే ఆయన నటన
కూడా సాధారణం. ప్రతీక్ బబ్బర్ కూడా చేసిందేమీ లేదు. యోగిబాబు అక్కడక్కడా
కొంత నవ్వించాడు. మిగతా నటీనటులు మామూలే.

సాంకేతికవర్గం:

మామూలుగానే
అనిరుధ్ రవిచందర్ స్టార్ హీరోల సినిమాలకు మంచి ఊపున్న బ్యాగ్రౌండ్
స్కోెర్ పాటలు ఇస్తాడు. రజనీ అనేసరికి ఆ ఊపు మరీ ఎక్కువైపోవడం సమస్యగా
మారింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల గూస్ బంప్స్ ఇచ్చినా.. కొన్ని
చోట్ల మరీ లౌడ్ గా తయారై చెవుల తుప్పు వదలగొట్టేస్తుంది. ఏమీ లేని సీన్లకు
కూడా అంత సౌండ్లు ఎందుకు అనే భావన కలుగుతుంది. పాటల్లో దుమ్ము దూళి
బాగుంది. మిగతావి మామలూలే. ‘పేట’ మాదిరి పాటలు ప్రత్యేకంగా అయితే లేవు.
పాటల్లో తమిళ వాసనలు ఎక్కువయ్యాయి. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం బాగుంది
కానీ..  ఆయన తన ‘క్లాస్’ చూపించే అవకాశాన్ని ఈ సినిమా ఇవ్వలేదు. ఈ
సినిమాకు ఇంకెవరు కెమెరా హ్యాండిల్ చేసినా ఇలాగే ఉండేదేేమో అనిపించేలా
మామూలుగానే ఉన్నాయి విజువల్స్. ఎప్పట్లాగే రజనీకి గాత్రాన్నందించినన మనో తన
ప్రత్యేకతను చాటుకున్నాడు. డైలాగులు ఓకే.  లైకా ప్రొడక్షన్స్ వాళ్లు తమ
స్థాయికి తగ్గట్లే సినిమాపై ఖర్చు పెట్టారు. ఐతే వనరులకు ఢోకా లేకపోయినా..
మురుగదాస్ మాత్రం సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. మిగతా దర్శకుల మాదిరే ఆయన
కూడా రజనీ చరిష్మా మీద డిపెండ్ అయిపోవడం నిరాశ కలిగించే విషయం. ఆయన
ఎంచుకున్న కథ అతి సాధారణమైంది. ఒకప్పటిలా స్క్రీన్ ప్లేతోనూ మ్యాజిక్
చేయలేకపోయాడు. ఆయన తన టచ్ కోల్పోతున్నట్లే ఉన్నాడు. ప్రి ఇంటర్వెల్ ఎపిసోడ్
లో మినహాయిస్తే ఇది మురుగదాస్ సినిమా అన్న ఫీలింగే కలగదు. మురుగదాస్ లో
ఐడియాలు అయిపోతున్నాయనే సందేహాల్ని ‘దర్బార్’ మరింత పెంచుతుందనడంలో సందేహం
లేదు.

చివరగా: దర్బార్.. విషయం తక్కువ.. స్టైల్ ఎక్కువ

రేటింగ్-2.25/5

Disclaimer
: This Review is An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in TheatreSource link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *